తీరొక్క పూల పండుగ బతుకమ్మ కూకట్పల్లిలో షురూ….
అమవాస్యకు రెండు రోజుల ముందే ప్రారంభం అవుతున్న బతుకమ్మ వేడుకలు…
డీజేలు ఉండవు…. సీనిమా పాటలు ఉండవు…. సంస్కృతి సంప్రదాయాలతో ….
గ్రామ పెద్దలు, అమ్మమ్మ, నానమ్మల నోట బతుకమ్మ పాటలు…
అంగరంగ వైభవంగా కొనసాగే బతుకమ్మ వేడుకలకు కూకట్పల్లి ముస్తాబు…
తీరొక్క పూలు… రంగు రంగుల పూలు… తెలంగాణ ఆడపడుచులు ఎప్పుడు ఎప్పుడా అని వేచి చూసే పూల పండుగ బతుకమ్మ వచ్చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే పూల పండుగకు తెలంగాణ రాష్ట్ర వ్యప్తంగా ఆడపడుచులు సిద్దం అవుతున్న వేళా కూకట్పల్లిలో మాత్రం బతుకమ్మ వేడుకలు ఈ ఏడాది రెండు రోజుల ముందే ప్రారంభం అవుతున్నాయి.తెలంగాణలో తీరొక్క పువ్వుల పండుగ సంబురాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి నుంచి లభించిన పువ్వులను పూజించే పండుగ ఇది, తెలంగాణ వ్యాప్తంగా ఆడపడుచులు ఎంతో ఇష్టంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగకు కూకట్పల్లి గ్రామం ముస్తాబవుతుంది. ప్రతి ఏడాది విజయ దశమికి ముందు ఆడపడుచులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పువ్వుల పండుగ ఈ సారి కూకట్పల్లిలో అమావాస్యకు రెండు రోజుల ముందే ప్రారంభం అవుతుందిన. ప్రతి ఏదాది రాష్ట్రంలో ఎక్కడ నిర్వహించని విధంగా అమావాస్యకు ఒక రోజు ముందు బతుకమ్మ వేడుకలు కూకట్పల్లి గ్రామంలో ప్రారంభించడం గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితి. అమవాస్య శనివారం వస్తుండటం, ఒక రోజు ముందు శుక్రవారం కావడంతో కూకట్పల్లిలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించరు దీంతో గ్రామ పెద్దలు గురువారం నుంచే బతుకమ్మ వేడుకలు అంటే అమవాస్యకు రెండు రోజుల ముందే ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

ఆరు సముద్రాల అవతల ఉన్న, పొరుగు రాష్ట్రాలలో ఉన్న ఆదపడుచులు అందరి పయనం కూకట్పల్లి వైపే:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలలో కూకట్పల్లి గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. అన్ని ప్రాంతాలలో కన్న ఒక రోజు ముందే బతుకమ్మ వేడుకలకు కూకట్పల్లి గ్రామం ముస్తాబు అవుతుంది. ఇదిలా ఉంటే బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు, కూకట్పల్లి గ్రామం నుంచి వేరే రాష్ట్రాలలో, విదేశాలలో నివాసం ఉంటున్న సరే ఆడపడుచులు తమ ఊరి బాట పట్టడం ఇక్కడి ఆనవాయితి. ఎంత దూరం ఉన్న బతుకమ్మ వేడుకలకు ఆడబిడ్డలు తమ పుట్టింటికి చేరుకుంటారు. తన గ్రామంలో బతుకమ్మ వేడుకలను జరుపుకునేందుకు ఇష్టపడతారు.

అమ్మమ్మలు, నానమ్మల నోట బతుకమ్మ పాటలు, డీజేలకు నో ఎంట్రీ:
కూకట్పల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద ఉన్న బతుకమ్మ మైదానంలో ప్రతి ఏడాది బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తు ఉంటారు. ప్రతి రోజు మహిళలు బతుకమ్మలను పేర్చి గౌరమ్మను పూజించి వేడుకలను ప్రారంభిస్తారు. కూకట్పల్లి గ్రామంలో జరిగే బతుకమ్మ వేడుకలలో డీజే పాటలు, సినిమా పాటలు వినిపించవు, గ్రామానికి చెందిన పెద్దలు, అమ్మమ్మలు, నానమ్మలు మాత్రమే మైదానం మధ్యలో కూర్చుని బతుకమ్మ పాటలు, గౌరమ్మ కథలు చెబుతుంటే మహిళలు బతుకమ్మ ఆడటం ఇక్కడ విశేషం.

తొమ్మిది రోజుల పండుగ:
ఈ నెల 8వ తేదిన ప్రారంభం అయ్యే బతుకమ్మ వేడుకలు 18వ తేదిన సద్దుల బతుకమ్మతో ముగిస్తాయి. 9 రోజుల పాటు తీరొక్క పూలతో బతుకమ్మ లను పేర్చి మహిళలు గౌరమ్మను పూజించి బతుకమ్మ ఆడతారు. అనంతరం జాతీయ రహదారికి అవతలి వైపు ఉన్న పిఎన్ఎం స్కూల్ వద్ద రంగధాముని చెరువులో నిమజ్జనం చేస్తారు. చివరి రోజు 18న సద్దుల బతుకమ్మ నాడు గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి భారి బతుకమ్మలను తయారు చేసి గ్రామ పురవీధులలో ఊరేగించి రంగధాముని చెరువులో నిమజ్జనానికి తరలిస్తారు. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా 20 నుంచి 30 అడుగల వరకు ఉండే భారి బతుకమ్మలను పేర్చి పురవీధులలో ఊరేగిస్తుంటే వాటిని చూసేందుకు వచ్చే జనంతో కూకట్పల్లి గ్రామం అంత కిక్కిరిసి పోతుంది. బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు బతుకమ్మ ఉత్సవ కమిటి సభ్యులు కంచనపల్లి నాగరాజు తెలిపారు.