మందిని కలుపుతున్న మంది…
ఒకే పళ్లెంలో కలసి తింటూ.. దూరమవుతున్న బంధాలను దగ్గర చేస్తున్న అరేబియన్ వంటకం!
తెలంగాణ గొంతుక:
ఒకప్పుడు ఇంట్లో అందరూ కలిసి కూర్చుని భోజనం చేసేవారు. ఒకే పళ్లెంలో అన్నం కలుపుకుని తినడం, ఒకరికి ఒకరు ముద్దలు పెట్టుకోవడం, తింటూ కబుర్లు చెప్పుకోవడం, ఇవన్నీ కుటుంబ బంధాల్లో భాగంగా ఉండేవి. కానీ కాలం మారింది. ఉరుకుల పరుగుల జీవితం, వ్యక్తిగత అలవాట్లు, పరిశుభ్రతపై పెరిగిన శ్రద్ధ. ఇలా రకరకాల కారణాలతో చాలామంది ఎవరి ప్లేట్ వారిదే అన్నట్టుగా మారిపోయారు. భోజన అలవాట్లు మారాయి. అయితే ఇప్పుడు ఓ అరేబియన్ వంటకం మళ్లీ అందరినీ ఒక చోట కూర్చోబెడుతోంది. అదే మంది!…
ఒకే పళ్లెం.. ఎన్నో అనుబంధాలు!..
రెస్టారెంట్లో ఓ పెద్ద పళ్లెం నిండా సువాసన వెదజల్లే బిర్యానీ తరహా వంటకం.. దాని మధ్యలో రుచికరమైన చికెన్ లేదా మటన్ తో వడ్డించే ఆహారం. చుట్టూ ఇద్దరు, ముగ్గురు స్నేహితులు కూర్చుంటారు. ఎవరి చేతిలోనూ ప్రత్యేక ప్లేట్ లేదు. అందరూ ఒకే పళ్లెం నుంచి తీసుకుంటూ తింటున్నారు. మధ్య మధ్యలో నవ్వులు, సరదా మాటలు, స్నేహితుల మధ్య చిన్నపాటి ఆటపట్టింపులు. అక్కడ భోజనం కంటే ఆ అనుభూతికే ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది. మంది తినడం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం మాత్రమే కాదు. కలిసి కూర్చోవడం, మంచి చెడు పంచుకోవడం, ఆ క్షణాలను జ్ఞాపకాలుగా మలుచుకోవడం కూడా!
యువత నుంచి కుటుంబాల వరకు..
ఒకప్పుడు కొత్త రుచులు ఆస్వాదించాలనుకునే కొందరికే పరిమితమైన ఈ వంటకం. ఇప్పుడు యువతను, స్నేహితుల బృందాలను, కుటుంబాలను సైతం ఆకర్షిస్తోంది. తమకు ఇష్టమైన వారితో కలిసి మంది తినేందుకు ఎంత దూరమైనా ప్రయాణిస్తున్నవారూ కనిపిస్తున్నారు. పుట్టినరోజు వేడుకైనా, స్నేహితుల కలయికైనా, కుటుంబంతో సరదాగా గడిపే సమయమైనా. మంది ఒక ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. పెద్ద పళ్లెం చుట్టూ అందరూ చేరడం వల్ల భోజనానికి ఓ సామూహిక అనుభూతి తోడవుతోంది.
అరేబియా నుంచి మన భోజన బల్ల వరకు..
మంది వంటకం అరేబియా ద్వీపకల్ప ప్రాంతంతో అనుబంధం ఉన్న సంప్రదాయ వంటకం. సువాసనగల అన్నం, మాంసం, ప్రత్యేక మసాలాలతో తయారయ్యే ఈ వంటకం. తన రుచితో పాటు వడ్డించే విధానంతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెద్ద పళ్లెంలో అందరూ కలిసి తినే పద్ధతి దాని ఆకర్షణను మరింత పెంచుతోంది. రుచుల కోసం మొదలైన ప్రయాణం. స్నేహితుల కలయికగా మారుతోంది. ఓ పళ్లెం చుట్టూ మొదలైన పరిచయం. మరిన్ని జ్ఞాపకాలకు దారితీస్తోంది. మంది మనకు చెబుతున్న సందేశం కూడా ఇదే. పళ్లెం పెద్దదా, చిన్నదా అన్నది కాదు ముఖ్యం. దాని చుట్టూ మనతో కూర్చున్న మనుషులు ముఖ్యం. రుచి నాలుకకు ఆనందాన్నిస్తే.. కలిసి గడిపిన క్షణాలు మనసుకు ఆనందాన్నిస్తాయి.
నిజమే…. మంది కేవలం ఓ వంటకం కాదు. మనుషులను ఒకచోట చేర్చే ఓ రుచికరమైన సందర్భం.
